తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించింది. ఈ మేరకు ఎన్ఐసీతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణకు ఈ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరు బాగుంటే ఒప్పందాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తామని తెలిపింది. భూముల రికార్డ్స్ మెయింటెనెన్స్‌లో పారదర్శకత, వేగవంతం కోసం పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థకు అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ధరణి నిర్వహణ బాధ్యతలను చూస్తున్న TerraCISతో ఒప్పందం ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్‌కు సాంకేతిక భాగస్వామిని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ధరణి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుండగా.. ఇకపై కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఎన్ఐసీ చూసుకోనుంది. ధరణి పోర్టల్‌కు చెందిన సాంకేతిక అంశాలను నవంబరు 30వ తేదీ వరకు టెరాసిస్ సంస్థ ఎన్ఐసీకి పూర్తి స్థాయిలో బదలాయించనుందని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.