Saturday, September 21, 2024
Homeతెలంగాణతెలంగాణలో 'యథా రాజా తథా పోలీసులు'

తెలంగాణలో ‘యథా రాజా తథా పోలీసులు’

Date:

తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పోలీస్ అధికారులు పడిన కష్టమంతా వృథా అవుతుందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు పోలీసు అధికారులకు సంబంధించి అవినీతి ఆరోపణలపై వచ్చిన కథనాలపై ఎక్స్ వేదికగా స్పందించారు. యువ అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండి, వాళ్లకి పని పట్ల నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని నేర్పించాలన్నారు. కానీ ‘యథా రాజా తథా పోలీసులు’ అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనలతో గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దామని, ఆ ప్రక్రియలో ఎందరో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ పోలీస్ అధికారుల పాత్ర కచ్చితంగా ఉందన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్రాండ్‌కు కొందరి తీరు కారణంగా అవినీతి మకిలి పడితే పోలీస్ అధికారులు పడ్డ కష్టమంతా వృథా అవుతుందన్నారు. ఒక్కసారి ఈ విషయాన్ని తెలంగాణ సీనియర్ పోలీస్ అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి సూచించారు.