తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం రోజున కరీంనగర్‌లో జరిగిన ‘ప్రజాపాలన’ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామాలను ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నామని.. ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్‌వర్క్ విస్తరణను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా ఈ గ్రామాల్లో 360 డిగ్రీస్‌లో ఏఐ ఫీచర్లతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తి చేసి.. అక్కడ ఏవైనా సాంకేతిక పరమైన లోపాలు ఎదురైతే వాటిని గుర్తించి, ఇంకా ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందా అనే విషయాలను పరిశీలిస్తామని చెప్పారు. ఇంటర్నెట్‌తో పాటు, కేబుల్ టీవీ సేవలుకు 20 MBPS అపరిమిత డేటా కూడా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా అందించబడుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటికే 8000 గ్రామాలకు ఫైబర్ కేబుల్ అందించామని, మరో 3 వేల గ్రామాలకు విస్తరించాల్సి ఉందన్నారు.