రైతులకు మేలు చేయాలని ఉమ్మడి ఏపీలోని పాలకులు ఆలోచించలేదని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తన తాతకు 400 ఎకరాల ఆస్తి ఉండేదని అయితే అన్ని ఎకరాలు ఉన్నప్పటికీ నీళ్లు లేకపోవడంతో అవి నిరుపయోగంగా, విలువ లేకుండా ఉండేవన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
”ఎన్నికల ముందు మార్పు..మార్పు.. అని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు పెట్టుబడులు రావని భయపెట్టారు. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు 2 రోజులు పవర్ హాలీడే ఉండేది. 2014కు ముందు రాష్ట్రంలో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవి. భారాస అధినేత కేసీఆర్ కృషి వల్లే భూముల ధరలు పెరిగాయి. సాగునీరు లేకపోతే వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. అదే జరిగితే సంపద సృష్టించడం అసాధ్యం. కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. తెలంగాణలో సంపద పెరిగింది. సాగునీటి సదుపాయాలు మెరుగయ్యాయి. తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలన తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పులు, చేసిన అభివృద్ధి ఏంటనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు” అని కేటీఆర్ అన్నారు.