Saturday, December 21, 2024
Homeతెలంగాణకేటీఆర్‌కు హైకోర్టులో ఊర‌ట‌

కేటీఆర్‌కు హైకోర్టులో ఊర‌ట‌

Date:

తెలంగాణ ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసును విచారణ కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో ఏసీబీ కేసుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై పలు సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. ఈ సెక్షన్లు ఈ కేసు కింద వర్తించవని అన్నారు. గత ఏడాది సీజన్‌ 9 కార్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్‌ 25నే ఒప్పందం జరిగిందని చెప్పారు. సీజన్‌ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్‌ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు.