రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్న వారిపై లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద జరిగింది. హైదరాబాద్ -బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొట్టి ఆగింది. లారీ డ్రైవర్ మాత్రం క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్లో అన్లోడ్ చేసి తిరిగి వికారాబాద్ వెళ్తున్న క్రమంలో లారీ అదుపుతప్పడంతో ఈ ఘటనకు చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్- బీజాపుర్ రహదారిపై భీతావహ వాతావరణం నెలకొంది. లారీ సృష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోడ్డును విస్తరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.