తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ కాని ఆహారాన్ని కల్తీ చేసేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని.. కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. నగరంలోని వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్ ఆర్‌వి కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ శివలీల, జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంత మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. వసతి గృహాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచనున్నట్టు మంత్రి ప్రకటించారు.