Monday, December 30, 2024
Homeతెలంగాణల‌క్షలాది మందికి నిద్రలేకుండా చేస్తున్నారు

ల‌క్షలాది మందికి నిద్రలేకుండా చేస్తున్నారు

Date:

తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఇబ్బందులు రాకూడదనే గతంలో మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో సుమారు 2లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పరిధిలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన పర్యటించారు. పలువురు బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు.

హైదరాబాద్‌లో బిఆర్ఎస్‌కు ఓట్లు వేసిన వారిపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని.. లక్షలాది మందికి నిద్రలేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు ఇళ్లు కూల్చుతారోనని ప్రజలు ఆవేదనతో ఉన్నారని చెప్పారు. ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే కంచెలు పెట్టాలన్నారు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కూడబలుక్కున్నారా?అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని పరోక్షంగా కిషన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బుతో మూసీ ప్రక్షాళన చేపట్టారన్నారు. బాధితులకు భారాస అండగా ఉంటుందని చెప్పారు. అంబర్‌పేటలో కేటీఆర్‌ కాన్వాయ్‌ను యూత్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు.