తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తన కంచుకోట మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సంచలన విజయాన్ని నమోదు చేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.
డీకే అరుణ మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పంతల్ మండలంలో జెడ్పిటిసిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు. 1996లో మొదటిసారి మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో నుంచి టీడీపీ పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో 3,700 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. 1999లో గద్వాల్ శాసనసభ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో మరోసారి ఓటమిపాలైంది. 2004లో కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించింది.
2007లో సమాజవాది పార్టీ నుంచి బహిష్కరణకు గురై.. వైఎస్సార్ సమక్షంలో మరలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో మరోసారి గద్వాల్ నుంచి పోటీ చేసి 10,331 మెజారిటీతో గెలుపొందారు. వరుసగా రెండో సారి శాసనసభ్యురాలిగా ఎన్నికకావడమే కాకుండా రాష్ట్రమంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా నియమితురాలైంది. 2014 ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గంలో 8వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైంది. 2019లో ఎంపీ టికెట్ దక్కపోవడంతో బీజేపీలో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.