Thursday, October 31, 2024
HomeUncategorizedరాష్ట్రం నుంచి ఢిల్లీ పెద్దలకు సూట్‌కేస్‌లు

రాష్ట్రం నుంచి ఢిల్లీ పెద్దలకు సూట్‌కేస్‌లు

Date:

తెలంగాణ‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమ‌ర్శించారు. హైదరాబాద్ శంషాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో, ఆయన సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లోనూ బీజేపీ జెండా ఎగిరిందని కిషన్‌రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయిందన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఎనిమిది నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ సర్కారుపై కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై విద్యార్థులు, మహిళలు పోరాటాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతోందని రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూట్‌కేస్‌లు పంపుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తోందని.. అయితే, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ ఒక్కటని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజా వ్యతిరేకతలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్​లపై విమర్శించారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీ ఒక్కటేనని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు బీజేపీపై అసత్య ప్రచారం చేసినా.. ప్రజలు మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉంచారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ కూడా వెళ్తోందని ఆయన విమర్శించారు.