తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాబోయే మూడు రోజులు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ , సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా వీయనున్నాయి. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఆయా జిల్లాలకు చెందిన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
2015, 2016 సంవత్సరాల్లో ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఎండలకు భరించలేక ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మళ్లీ భానుడు ఇప్పుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. అత్యవసర పనులుంటే బయటకు రావాలని, ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా కచ్చితంగా గొడుగులు వేసుకొని రావాలని, సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తిచేసుకొని ఇంటికి తిరిగివెళ్లాలని చెబుతున్నారు. ఆదివారం నుంచి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే స్పష్టత రాదని, ఈ సంవత్సరం మాత్రం ఎండలు తీవ్రంగా ఉంటాయని, ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.