ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు మమ్మల్ని ఉన్నతస్థానంలో నిలబెట్టిందని, నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయన్నారు. కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కమ్మ అంటే అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారని ప్రశంసించారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారని పేర్కొన్నారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారని వివరించారు. కష్టపడటం, పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణమన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు కమ్మవారి భాగస్వామ్యం అవసరమన్నారు. నైపుణ్యాలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తమకు భేషజాలు లేవని తాము లాన్ని అభిమానిస్తాం, ఇతర కులాలను గౌరవిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని రేవంత్ స్పష్టం చేశారు. అది తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తమ హక్కుగా పేర్కొన్నారు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో చూశాగా అని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోందన్నారు. కుల, మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలని రేవంత్ తెలిపారు. వివాదంలో ఉన్న 5 ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. పదిమందికి సాయం చేసే మీ సహజ గుణాన్ని వీడొద్దని కోరారు.