తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందన్నారు. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారన్న ఆయన.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
”అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను సమీక్షించాలి. విద్యుత్తు, రహదారులను వెంటనే పునరుద్ధరించాలని కోరాం. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తాం. పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేతలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి” అని విజ్ఞప్తి చేశారు.