Wednesday, January 15, 2025
HomeUncategorizedతెలంగాణలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం..

తెలంగాణలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం..

Date:

తెలంగాణ రాష్ట్రం దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఆయన వారితో చర్చించారు. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏవిధంగా ఉండాలనే దానిపై పలు సూచనలు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలని, అన్ని రకాల క్రీడలను, క్రీడా శిక్షణ సంస్థలను ఒకే గొడుగు కిందకు తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యమన్నారు.

మన దేశంతో పాటు తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు, మన శారీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలు ఏవో గుర్తించి, క్రీడలపై ఉత్సాహం ఉన్న వారిని గుర్తించి వారిని ఆయా క్రీడల్లో ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌, కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌ను భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు వేదికగా మార్చాలని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా ప్రతి క్రీడలో మన క్రీడాకారులు పతకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దాలని, అందులో మన స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులు కచ్చితంగా ఉండాల్సిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం వారికి నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పించాలన్నారు.