తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్ సహా, అనేక జిల్లాలలో ఆకస్మిక వర్షాలు కురవడంతో ప్రజలు అనేకచోట్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని, 22వ తేదీ వరకు ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.అయితే మే 31వ తేదీన ముందస్తుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
క్యుములోనింబస్ మేఘాలతో కుండపోత వర్షాలు
ఈసారి తీవ్రమైన ఎండలు నమోదు కావడంతో వర్షాలు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో లేనప్పటికీ, గత నెలలో నమోదైన ఎండల నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తున్నాయి.