Thursday, October 31, 2024
HomeUncategorizedచిలుకూరు ఆలయంలో సంతానం కోసం గరుడ ప్రసాదం

చిలుకూరు ఆలయంలో సంతానం కోసం గరుడ ప్రసాదం

Date:

సంతానం లేని వారికి గరుడ ప్రసాదం వితరణపై ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో ఉదయం నుంచే భారీగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ క్రమంలో దాదాపు 30 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా.. వాహనాదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాసబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దాదాపు లక్ష మంది వరకూ వాహనాల్లో వెళ్లినట్లు అంచనా వేస్తుండగా.. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు.

హైదరాబాద్ లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు వేద పండితులు పుట్టమన్నుతో హోమ గుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. శుక్రవారం ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించనున్నారు. శుక్రవారం గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం పంచనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే భాగ్యనగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. కార్లు, ఇతర వాహనాల్లో తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో భక్తులు తమ బైక్స్, కార్లు పార్క్ చేసి కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వస్తున్నారు.