Thursday, October 31, 2024
HomeUncategorizedచిన్నారికి జీవిత కాల బస్ పాస్ ఫ్రీ

చిన్నారికి జీవిత కాల బస్ పాస్ ఫ్రీ

Date:

కరీంనగర్‌ బస్‌ స్టేషన్‌ ఆవరణలో జూన్ 16 ఆదివారం రోజున చిన్నారి జన్మించింది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ పాపకు జీవిత కాల ఫ్రీ బస్ అందివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న పాప, ఆమె కుటుంబ సభ్యులను కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ అధికారులు కలిశారు. చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్‌ పాస్‌ను అందించారు. బస్‌ పాస్‌ తో పాటు వారికి రూ.14 వేల ఆర్థిక సాయంతో పాటు వస్త్రాలను అందజేశారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. “కరీంనగర్‌ బస్‌ స్టేషన్‌ లో ఇటీవల పుట్టిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్‌ పాస్‌ను #TGSRTC యాజమాన్యం అందజేసింది. స్థానిక ఆస్పత్రిలో కుటుంబసభ్యులను ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ అధికారుల బృందం శనివారం కలిసింది. ఆడపిల్లకు బస్‌ పాస్‌ తో పాటు వారికి రూ.14 వేల ఆర్థికసాయం, వస్త్రాలను అందజేసింది” అని ట్వీట్ చేశారు. “నిరుపేద కుటుంబానికి ఆర్థికసాయంతో పాటు వస్త్రాలను అందజేసి గొప్ప మనసు చాటుకున్న ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ అధికారుల బృందానికి అభినందనలు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి మానవత దృక్పథంతో స్పందించి కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బందికి మరొకసారి సంస్థ అభినందనలు తెలియజేస్తోంది. సమయసూర్తితో వ్యవహారించి సకాలంలో స్పందించిన మీ సేవా ఆదర్శనీయం” అని పేర్కొన్నారు.

ఒడిశాకు చెందిన కుమారి-దూల దంపతులు పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుక బట్టీల్లో పని చేస్తున్నారు. కుమారి ప్రసవ సమయం కావడంతో వారు సొంతూరు వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్నారు. కుమారి నొప్పులు రావడంతో దూల స్టేషన్ మాస్టర్ అంజయ్య గౌడ్ కు సమాచారం ఇచ్చారు. ఎస్ఎం కుమారి వద్దకు సిబ్బింది పంపించి.. 108కు సమాచారం ఇచ్చారు. ఆలోపే ఆమెకు నొప్పులు రావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ప్రసవం చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు.