తెలంగాణలో జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమం అయింది. ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 నుంచి గ్రూప్-1 ప్రధాన పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్ జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ గది, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షించనున్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని, మధ్యాహ్నం 1.30 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వరకు 90 శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, డౌన్లోడ్ చేసుకునేందుకు 20వ తేదీ వరకు అవకాశం ఉందని టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.