Friday, January 3, 2025
Homeతెలంగాణఅమ‌రులైన పోలీసు కుటుంబాల‌ను ఆదుకుంటాం

అమ‌రులైన పోలీసు కుటుంబాల‌ను ఆదుకుంటాం

Date:

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదన్నారు. అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులను గుర్తు చేసుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. అమరులైన కానిస్టేబుల్‌, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అమరులైన ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షలు.. డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు.. ఎస్పీ, ఐపీఎస్‌ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు.

తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సైబర్‌ క్రైమ్‌ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించింది. ఇవాళ డ్రగ్స్‌ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. డ్రగ్స్‌ వల్ల పంజాబ్‌ అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. మాదకద్రవ్యాల వినియోగం రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. వీటి నివారణకు రాష్ట్రంలో టీజీన్యాబ్‌ను ఏర్పాటు చేశాం. ఏఐ పరిజ్ఞానంతో ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించేవారిని గుర్తిస్తున్నాం. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నాం. వివిధ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడంలో పోలీసుల సేవలు మరచిపోలేము. జీతం కోసం వారు పనిచేయడం లేడు. బాధ్యతాయుతంగా భావించి సేవలు అందిస్తున్నారు” అని రేవంత్‌రెడ్డి తెలిపారు.