Sunday, October 6, 2024
Homeక్రీడలుబీసీసీఐ ఇచ్చిన రూ.125 కోట్లలో ఎవరెంత తీసుకున్నారు

బీసీసీఐ ఇచ్చిన రూ.125 కోట్లలో ఎవరెంత తీసుకున్నారు

Date:

టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను ప్రకటించింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న క్రికెటర్లతో పాటు పెవిలివిన్ కు పరిమితమైన వారు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా ఈ బహుమతిని పంచుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరి వాటా ఎంత లభించనుందనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది.

వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా, వెస్టిండీస్ లకు క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్ కలిపి మొత్తం 42 మంది వెళ్లారు. వీరంతా ఇప్పుడు ఈ రూ.125 కోట్లను పంచుకోవాల్సి ఉంది. ఇందులో ఆటగాళ్లకు ఎంత, సపోర్టింగ్ స్టాఫ్ కు ఎంత అన్నదీ బీసీసీఐ నిర్ణయిస్తోంది. దీని ప్రకారం ఆయా ఆటగాళ్లు, సిబ్బందికి ఓ భారీ కార్యక్రమం పెట్టి అందించబోతోంది. దీంతో ఎవరెవరు ఎంత తీసుకోబోతున్నారన్న దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

తాజా నివేదిక ప్రకారం జట్టులో ఉండీ ఒక్క మ్యాచ్ కూడా ఆడని వారితో సహా భారత జట్టులోని 15 మంది సభ్యులకు రూ. ఒక్కొక్కరికి 5 కోట్లు లభించబోతున్నాయి. అలాగే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కూడా రూ.5 కోట్లు ఇస్తున్నారు.ఇక ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్ విషయానికొస్తే.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సహా వారందరికీ రూ. ఒక్కొక్కరికి 2.5 కోట్లు లభించనున్నాయి. అలాగే అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున ఇవ్వనున్నారు.

సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు చొప్పున ఇవ్వనున్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో పాటు నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా తీసుకుంది. వీరిలో రింకూ సింగ్, శుభమాన్ గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ కు ఒక్కొక్కరికి కోటి రూపాయల రివార్డ్ లభించనుంది. ఈ వివరాలను ఇప్పటికే ఆటగాళ్లు, స్టాఫ్, కోచ్ లు, సెలెక్టర్లకు అందించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా టీమిండియాకు రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది.