ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితా ఏటా రిలీజ్ అవుతుంటుంది. ఆసియా దేశాల నగరాలే ఈ జాబితాలో ఎక్కువగా ఉంటాయి. మన దేశ రాజధాని ఢిల్లీ టాప్ 5లో ఉంటుంది. అయితే, ఈ ఏడాది రిలీజైన లిస్టులో మాత్రం వేరే నగరం తొలి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ సాంస్కృతిక నగరమైన లాహోర్ మరోసారి అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
లాహోర్ నగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 394గా నమోదైంది. అంటే, ప్రజారోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయన్నమాట. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 దాటితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా భావిస్తారు. 150 దాటితే ‘తీవ్రమైన హానికరం’గా పరిగణిస్తారు. అలాంటిది లాహోర్లో ఇందుకు డబుల్ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గాలి నాణ్యత పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గాలి నాణ్యత లేమితో ఇప్పటికే చాలా మందిలో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్ల సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంతో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత 354గా నమోదైంది.