ఇటీవల కాలంలో లొట్ట పీసు అనే పదం బాగా వినిపిస్తోంది. కాని లొట్ట పీసు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. లొట్టపీసు చెట్టు వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లొట్ట పీసు మొక్కలో ఉండే పాలు తేలు విషానికి విరుగుడులా పనిచేస్తాయి. చర్మం మీద తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ పాలు రాస్తే తగ్గిపోతుంది.
మనుషులను కుట్టే దోమలను, పంటల దిగుబడిని దెబ్బతీసే దోమలను ఈ మొక్క ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించొచ్చు. లొట్ట పీసు మొక్కలను కాగితం తయారీలోనూ వినియోగిస్తారు. ఈ చెట్టు ఆకులను ఉపయోగించడం వల్ల మనం పాదాల వాపులను తగ్గించుకోవచ్చు. లొట్టసు పీసు చెట్టు ఆకులను మెత్తగా నూరి దానికి ఆవనూనె కలిపి వేడి చేయాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను పాదాల వాపులపై రాసి నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల వాపులు తగ్గుతాయి.
వయసుపై బడే కొద్ది అనేక రకాల నొప్పులు వస్తూ ఉంటాయి. నొప్పులతో బాధపడతున్నప్పుడు ఈ ఆకుల పేస్ట్ ను రాసి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. కానీ, దీనిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
లొట్టపీసు చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి.. గో మూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులా ఉపయోగిస్తారు. పల్లెల్లో ఈ కట్టెలతో ఇళ్లకు దడిగా, పశువుల కొట్టాలకు రక్షణ గోడగా కట్టుకునేవారు. ఎండిపోయిన లొట్టపీసు కట్టెలను వీపునకు కట్టుకొని పిల్లలు ఈత నేర్చుకునేవారు. ఇలా ఈ లొట్టపీసు చెట్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.