మనిషి నేర్చుకోవాలనే తపన ఉండాలి కాని దానికి వయసుతో సంబంధమే లేదు. ఏ వయసులోనైనా ఏదైనా నేర్చుకోవచ్చు. అలాంటిది 60 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన ‘NEET UG’లో పాసై ఎందరినో ఆశ్చర్యపరిచారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన జై కిషోర్ ప్రధాన్(64)కి మెడిసిన్ చదవాలనే ఆసక్తి ఉండేది. కాని కొన్ని కారణాల వల్ల బ్యాంక్ ఉద్యోగిగా మారిపోయాడు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరి డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసినా మెడిసిన్ చేయాలన్న ప్యాషన్ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో రిటైర్ అయ్యాక కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరూ రిటైర్ అయ్యాక వేర్వేరు ప్రణాళికలు వేసుకుంటుంటే.. ఈయన మాత్రం తిరిగి చదవాలని డిసైడ్ అయ్యారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటన్నిటినీ నిర్వర్తిస్తూనే మెడిసిన్ చదువుపై ఫోకస్ పెట్టారు.
పక్కా ప్లానింగ్‌తో ప్రిపరేషన్
స్టెతస్కోపు మెడలో వేసుకోవాలన్న జై కిషోర్ సంకల్పం ముందు ఆయన వయసు తలవంచింది. పక్కా ప్రణాళికతో ఆయన నీట్ ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఇందుకోసం ఓ ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యారు. టఫ్ సిలబస్‌ని ప్లానింగ్ ప్రకారం చదవడం ప్రారంభించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సూచించిన టిప్స్ పాటిస్తూ ఎప్పటికప్పుడు తనని తాను మెరుగు పరుచుకున్నారు. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తూ ఫ్రెష్ క్యాండిడేట్లకు పోటీనిచ్చేలా ప్రిపేర్ అయ్యారు. ఆయన చూపిన డెడికేషన్, పట్టుదలకి నీట్ ర్యాంక్ దాసోహం అయింది. 2020లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని క్లియర్ చేసి వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో సీటు సంపాదించారు.
చదువుకు వయసు అడ్డంకి కాదు
మన దేశంలో నిర్వహించే పోటీ పరీక్షలకు ఏజ్ లిమిట్ అనేది కచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి వయసు పరిమితి నిబంధనను అమలు చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లకు మాత్రం ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ ఉండదు. ఏ వయసులోనైనా చదువుకోవాలన్న ఉత్సాహం కలగొచ్చని, చదువుకోవడానికి వయసు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనను చేర్చలేదు. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ సైతం ఇదే చెబుతోంది. నీట్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్‌ని సెట్ చేయలేదు. చదువుకోవాలన్న ఆసక్తి ఉండే ఉత్సాహవంతులను ఈ పాలసీ ఎంకరేజ్ చేస్తోందనే చెప్పాలి.