Saturday, September 28, 2024
Homeప్రత్యేక కథనాలుపౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారం లీక్ అవుతోంది..

పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారం లీక్ అవుతోంది..

Date:

ఇంట‌ర్నెట్ విచ్చ‌ల‌విడిగా పెరిగిపోవ‌డంతో సైబ‌ర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది.. సైబ‌ర్ మోసాల‌తో పాటు మ‌నిషికి సంబంధించిన ఆధార్, పాన్‌కార్డ్ అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ కూడా లీక్ అవుతున్నాయి. వీటిలో పౌరుల వ్యక్తిగత, అడ్రస్ వంటి సున్నితమైన సమాచారం ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం పౌరుల పాన్‌కార్డ్, ఆధార్ కార్డుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయినప్పటికీ అప్పుడప్పుడు పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతున్న ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇటీవల కొన్ని వెబ్‌సైట్స్ పౌరుల ఆధార్ కార్డ్, పాన్ వివరాలను బహిర్గతం చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వాటిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

వెలుగులోకి తెచ్చిన వెంచర్ క్యాపిటలిస్ట్‌

మనీకంట్రోల్‌ రిపోర్ట్ ప్రకారం.. ఇండియన్ ఏరోస్పేస్ అండ్ ఇంజనీరింగ్, ది స్టార్ కిడ్జ్ అనే రెండు వెబ్‌సైట్స్ ఇటీవల పౌరుల ఆధార్ డేటాను బహిర్గతం చేస్తున్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 26 వరకు ఇండియన్ ఏరోస్పేస్ అండ్ ఇంజినీరింగ్ వెబ్‌సైట్ పౌరుల వ్యక్తిగత డేటాను బహిర్గతం చేస్తే, స్టార్ కిడ్జ్ వెబ్‌సైట్ పిల్లల ఆధార్ వివరాలను షేర్ చేసింది. ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు నిర్ధారణ

ఈ ఘటనపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దర్యాప్తు చేసి పౌరుల ఆధార్, పాన్ వివరాలు లీక్ అయినట్లు నిర్ధారించాయి. దీంతో ఇండియన్ ఏరోస్పేస్ అండ్ ఇంజినీరింగ్, స్టార్ కిడ్జ్ వెబ్‌సైట్లపై బ్యాన్ విధించారు. ఈ రెండు వెబ్‌సైట్లు ఆధార్‌లోని సెక్షన్ 29(4)(ఆర్థిక, ఇతర రాయితీలు, ప్రయోజనాలు, సేవల లక్ష్యం డెలివరీ) నిబంధనను ఉల్లంఘించాయని స్పష్టం చేసింది.

తీవ్రంగా పరిగణిస్తూ బ్యాన్ చేశాం

ఈ అంశంపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ‘బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీ ఇంటర్నెట్‌ను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పౌరుల ఆధార్‌, పాన్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని కొన్ని వెబ్‌సైట్స్ బహిర్గతం చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వాటిపై బ్యాన్ విధించాం. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామ‌ని ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

భద్రతా లోపాల నివారణకు సూచనలు

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పౌరుల ఆధార్, పాన్ వివరాలు లీక్ అయిన ఇండియన్ ఏరో స్పేస్ అండ్ ఇంజనీరింగ్, ది స్టార్ కిడ్స్ సంస్థల వెబ్‌సైట్లను పరిశీలించింది. వాటిలో ఉన్న భద్రతా లోపాలను గుర్తించి నివారణ చర్యలను సూచించింది. వెబ్ సైట్లలో ఐసీటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను పటిష్టం చేయడం, వల్నరబిలిటీస్ పరిష్కరించడంలో వాటి యాజమాన్యాలకు అవసరమైన మార్గదర్శకత్వం చేసింది.