ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టులో పాములు పట్టే పోటీని నిర్వహిస్తారు. ఈసారి ఆగస్టు 9న మొదలైన ఈ పోటీలు ఆగస్టు 18తో ముగియనున్నాయి. దీనిలోభాగంగా హంటర్స్.. ఎవర్‌గ్లేడ్స్ ప్రాంతంలోని బర్మీస్ పైతాన్‌లను పట్టుకోవాలి. అవి 18 అడుగుల పొడవు, 200 పౌండ్ల వరకు బరువూ ఉంటాయి. 2000 సంవత్సరంలో ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో మొదటిసారి వీటిని గుర్తించారు. అయితే అవి అక్కడికి ఎలా చేరాయనే దానిపై స్పష్టత లేదు. ఇక అప్పటినుంచి అక్కడ వాటి సంతతి భారీగా పెరిగింది.
100గుడ్లు పెట్టే పైతాన్
ఒక ఆడ పైతాన్ ఒకేసారి 100 గుడ్లు పెట్టగలదు. ఎవర్‌గ్లేడ్స్‌లోని తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతం వాటి వృద్ధికి దోహదం చేస్తోంది. దాంతో అవి దక్షిణ ఫ్లోరిడాకు విస్తరించాయి. వాటి తాకిడి వల్ల స్థానిక జీవివైవిధ్యంపై ప్రభావం పడింది. ఈ పర్యావరణ సంక్షోభం నుంచి ఆ ప్రాంతాన్ని బయటపడేసేందుకు అధికారులు ‘ఫ్లోరిడా పైతాన్ ఛాలెంజ్’ను తీసుకువచ్చారు. ఆ పాముల జాతిని తగ్గించేందుకు ఈ పోటీల ద్వారా ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు వాటిని హింసించకుండా చంపివేయాలి. ఈవిషయమై శిక్షణ కూడా ఉంటుంది. ఫ్లోరిడాలో జీవహింస వ్యతిరేక చట్టాలు ఉన్నప్పటికీ.. కొన్నేళ్లుగా ఈ పోటీలు నడుస్తుండటం గమనార్హం.
మూడు కేటగిరిల్లో పోటీలు
అనుభవం లేనివారు, నిపుణులు, మిలటరీ.. ఇలా మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ లేక అత్యంత పొడవైన పైతాన్‌ను పట్టుకున్నవారికి నగదు బహుమతి దక్కుతుంది. ఎక్కువ పైతాన్లు పట్టుకున్న వ్యక్తికి 10వేల డాలర్ల వరకు అందనుంది. మొత్తంగా 25వేల డాలర్ల వరకు వివిధ కేటగిరీల్లో ప్రైజ్‌లు అందిస్తున్నారు. 2023లో జరిగిన పోటీలో 209 పైతాన్‌లను చంపివేశారు. ఇదిలాఉంటే.. ఆగస్టు నెల వీటి హంటింగ్‌కు కీలకం. ఈ వేసవికాలంలో సూర్యాస్తమయం తర్వాత అవి చురుగ్గా ఉంటాయి. దాంతో వాటిని గుర్తించడం తేలికగా మారుతుందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ పోటీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రకాల పాముల్ని చంపే అవకాశం ఉందని కొన్నివర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.