Wednesday, January 15, 2025
HomeUncategorizedన్యాయం చేయాల్సిన సిఎం రోడ్డెక్కితే న్యాయం చేసెదెవరు..?

న్యాయం చేయాల్సిన సిఎం రోడ్డెక్కితే న్యాయం చేసెదెవరు..?

Date:

కన్ను మూస్తే ఒక అఘాయిత్యం.. అడుగడుగునా వేధింపులు.. నిత్యకృత్యంగా మారిన మహిళలపై అత్యాచారాలు.. సంఘటన జరిగినప్పుడు మాత్రమే గళమెత్తే సమాజం.. సమాజానికి తగ్గట్టుగా స్పందించే పాలనాయంత్రాంగం.. అప్పటికప్పుడే రూపుదిద్దుకునే చట్టాలు.. మళ్లీ మామూలుగా మారుతున్న సంఘటనలు.. ఒక నిర్భయ, ఒక దిశ ఎన్ని చట్టాలు వచ్చినా పసి పిల్లల నుంచి పండు ముసలి నుంచి దారుణాలు ఆగడమే లేదు.. పశ్చిమబెంగాల్ కలకత్తాలో జరిగిన ఒక జూనియర్ వైద్యురాలి అత్యంత దారుణమైన అత్యాచార, హత్యపై న్యాయం చేయాల్సిన ఒక రాష్ట్ర మహిళ ముఖ్యమంత్రే బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కింది.. మరీ న్యాయం చేసేదెవరంటూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..

కుట్రపూరితంగానే చంపేశారు

డా. ప్రతిభాలక్ష్మి. హైదరాబాద్

అత్యాచారం వెనుక అనేక అనుమానాలు బలపడుతున్నాయి. ఒక వెయ్యి మంది దుండగులు సంఘటన జరిగిన ఆసుపత్రిపై దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారు. అంటే ఇది చిన్నవిషయం కాదు. దీని వెనుక పెద్దపెద్ద వాళ్లు ఉన్నారని తెలుస్తోంది. ఇది ఒక మహిళపై జరిగిన దాడి కాదు, ఒక వైద్యురాలిపై జరిగిన దాడి కాదు. దీని వెనకాల ఏదో లోతైన కారణాలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏదో బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటే కుట్రపూరితంగానే చంపారు. ఇది ప్రజా సమస్య. ప్రశ్నించే గొంతుకను చంపేశారు. దేశ ప్రజల నుంచి అన్ని సంఘాల నుంచి ఉద్యమం రావాలి. నిజాలు ఏంటో బయటపెట్టాలి. అప్పుడు మరణించిన మహిళకు న్యాయం చేసిన వాళ్లమవుతాం. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలి.

Dr. Prathibha Laxmi

న్యాయం అంటూ సిఎం నిరసన చేయడమా..?

డా. స్రవంతి. హైదరాబాద్

ఒక మహిళకు న్యాయం చేయాల్సిన ఒక రాష్ట్ర మహిళ ముఖ్యమంత్రి రోడ్ల పైకి న్యాయమంటూ రావడం చూస్తుంటే పెద్ద కామెడిలా, ఒక డ్రామాలా ఉంది. ఒక ముఖ్యమంత్రి ఇలా న్యాయం కావాలంటూ రోడ్లపైకి రావడంపై దేశ ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఒక జూనియర్ వైద్యురాలు అత్యంత దారుణంగా అమానుషానికి గురైతే తక్షణమే స్పందించి చర్యలు తీసుకొవాల్సిన సిఎం ప్రవర్తన విడ్డూరంగా కనిపిస్తోంది. ఒక మహిళకు న్యాయం చేయలేని, ఒక మహిళ సిఎం మమతా బెనర్జీ నిరసన చూసిన దేశ ప్రజలకు ఏం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

Dr. Sravanthi

ఎవరు ఎవరికి న్యాయం చేయాలి దీదీ ?

డాక్టర్ చక్రపాణి. సంగారెడ్డి

ఒక జూనియర్ వైద్యురాలు అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైతే ఎవరు న్యాయం చేయాలి. పశ్చిమ బెంగాల్ సీఎం ఎందుకు మీకు రోడ్డెక్కడానికి వారం పట్టింది ?. 10/08/2024 నాడు మీరు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలిపి ఉంటే మిమ్మల్ని నమ్మేవాళ్లం దీదీ ! 16వ తేదీ ఎన్నికల స్టంట్ లాగా, ప్రజావ్యతిరేకత పెరిగి పోతోందని గ్రహించి మీరు రోడ్డు మీదికి వస్తే నమ్మే ప్రజలు ఇక్కడ ఎవరూ లేరు దీదీ ! ఉన్న సాక్ష్యాలను 15 ఆగస్టు అర్ధరాత్రి ధ్వంసం చేస్తూంటే సాక్ష్యంగా నిలబడిన మీ పోలీసు బాసులను తీసుకోని ఇప్పుడు ర్యాలీకి బయలు దేరావా దీదీ ?.. దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు అనిపిస్తోంది మాకు..!

Dr. Chakrapani..

పథకం ప్రకారం చేసిన హత్యనే

డా. కీర్తన. ఉస్మానియా..

ఆరోగ్యశాఖ మంత్రి, హోం మంత్రి మరియు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి హోదాలో అధికారంలో ఉండి కూడా వారం గడిచినా ఏలాంటి చర్యలు తీసుకోలేదు. న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి న్యాయం కావాలంటూ రోడ్ల మీదికి రావడం ఏంటో అర్థం కావడం లేదు. ఒక మహిళ వైద్య విద్యార్థిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి కొట్టి చంపారు. ఆసుపత్రిలో ఆధారాలు ఎక్కడ దొరికిపోతాయని గుండాలచే దాడి చేపించారంటే ఈ సంఘటనలో ఎంతమంది పెద్దవాళ్లు ఉన్నారో అనే అనుమానం పెరిగిపోతుంది.

Dr. Keerthana..

రాజకీయ నాటకమే దీదీ నిరసన

డా. సురేఖ. వైజాగ్

పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని ప్రభుత్వ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించాల్సిన సిఎం రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం ఆశ్చర్యంగా ఉంది. సీఎం హోదాలో అధికారం చేతిలో ఉన్నప్పటికీ, ఈ చర్యల్ని తీసుకోకుండా, కేవలం న్యాయం కోసం రోడ్ల మీదికి రావడం ఒక రాజకీయ నాటకమే. ఈ విధంగా సర్కార్ నియంత్రణలో ఉండి ఇలాంటి చర్యలు చేయడం సరికాదు. ఆమె నిర్లక్ష్య రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంపై దుమ్ము ఎగరేయడానికి ప్రయత్నిస్తోంది. రోజులు గడుస్తున్నాయి కాని ఒక వైద్యురాలి దారుణానికి బాధ్యులెవరో తెల్చలేని వ్యవస్థలో మనం ఉండడం సిగ్గుచేటు..

Dr. Surekha