15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedసచివాలయం నిర్మించింది మేమే.. కానీ ఖర్చుల వివరాల్లేవ్

సచివాలయం నిర్మించింది మేమే.. కానీ ఖర్చుల వివరాల్లేవ్

Date:

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం నిర్మాణానికి ఎంత ఖర్చు చేసారు. ఖర్చు చేసిన నిధులు ఏ ఏ శాఖ నుండి ఎంతెంత విడుదల చేసారు. ఆర్ అండ్ బి నుండి ఎన్ని నిధులు కేటాయించారు. సచివాలయం నిర్మాణంలో ఎన్ని ప్రభుత్వ సంస్థలు పాల్గొన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. మేము అడిగిన సమాచారంపై ఆర్ అండ్ బి శాఖ స్పందించి సమాచారం పంపించారని, కాకపోతే పూర్తి సమాచారం పంపలేదని వారు వివరించారు.

ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని గత ప్రభుత్వం దీనికోసం నిధులను కేటాయిస్తూ మంజూరు చేసిన ఒక జీవో కాపీని చూపిస్తున్నారు కానీ వాస్తవంగా ఎంత అయిందనే విషయాన్ని వారు వెల్లడించట్లేదు. నూతన సచివాలయం నిర్మాణం, అందుకు వెచ్చించిన నిధుల గురించి వివరాలు తెలపాలంటూ యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ ఆర్‌ అండ్‌ బీ శాఖను సమాచార హక్కు కింద కోరగా.. గత ప్రభుత్వం జీవో ఎం ఎస్‌ నెం 47 ద్వారా రూ.617 కోట్లను మంజూరు చేసిందని, వాటిలో ఇప్పటివరకు రూ.588 కోట్లు ఖర్చు చేశామని సమాధానమిచ్చింది. కొత్త సచివాలయ శంకుస్థాపన 2019లో జరిగింది. 2020లో కొవిడ్‌ వల్ల.. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయి, ఆమేరకు సచివాలయ నిర్మాణ వ్యయం అంచనాలు కూడా పెరిగాయని గత ప్రభుత్వంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రిగా వ్యవహరించిన వేముల ప్రశాంత్‌ రెడ్డి పలుమార్లు తెలిపారు. నిర్మాణం కోసం మంజూరు చేసిన రూ.617 కోట్లకు అదనంగా మరో 20-30 శాతం మేర ఖర్చు పెరగొచ్చని అప్పుడే చెప్పారు. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం.. అంతకన్నా తక్కువ ఖర్చే అయిందని చెబున్నారు. దీంతో సచివాలయ నిర్మాణం ఖర్చులో ఏం జరిగిందనే చర్చ మొదలైంది.

తమ శాఖ నుంచే సచివాలయ నిర్మాణం చేసాం కానీ మిగతా శాఖలకు సంబంధించిన కేటాయింపులు వాటి ఖర్చుల వివరాలు మాత్రం మా దగ్గర లేవని తెలంగాణ రోడ్ల, భవనాల శాఖ జవాబు చెప్పడం విడ్డురంగా ఉందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర తెలిపారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి పూర్తి వివరాలు బయటపెట్టాలని వారు కోరారు.