Tuesday, December 24, 2024
Homeజాతీయంమ్యారిట‌ల్ రేప్‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

మ్యారిట‌ల్ రేప్‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Date:

మ్యారిట‌ల్ రేప్‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని నేరంగా పరిగణించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి తగిన శిక్ష విధించేందుకు ఇతర చట్టాలు ఉన్నాయని చెప్పింది. మ్యారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించే అధికార పరిధి సుప్రీంకోర్టుకు లేదని స్పష్టం చేసింది. మ్యారిటల్‌ రేప్‌ అనేది చట్టపరమైన సమస్య కన్నా ఎక్కువగా సాంఘికపరమైనదని వివరించింది. దీని ప్రభావం నేరుగా సమాజంపై ఉంటుందని చెప్పింది. సంబంధితులందరితోనూ సంప్రదించకుండా కానీ, అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కానీ మ్యారిటల్‌ రేప్‌పై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని తెలిపింది. వివాహం అనేది మహిళ ఇష్టానికి చెల్లుచీటీ రాయదనే విషయంతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించింది. మహిళ ఇష్టాన్ని పురుషుడు ఉల్లంఘించినట్లయితే, అందుకు దండన ఉండాలని తెలిపింది.

వైవాహిక బంధంలో ఉన్నవారి మధ్య ఇటువంటి ఉల్లంఘనలకు, అటువంటి బంధం లేనివారి మధ్య ఉల్లంఘనలకు తేడా ఉందని వివరించింది. దాంపత్యంలో భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త నిరంతరం సరైన లైంగిక సంబంధాలను ఆశిస్తారని, అటువంటి ఆకాంక్షలు భార్య ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలపాలని భార్యను బలవంతపెట్టే హక్కును భర్తకు ఇవ్వబోవని తెలిపింది. అత్యాచార నిరోధక చట్టాల ప్రకారం అటువంటి భర్తను శిక్షించడం మితిమీరినది, అవసరానికి మించినది అవుతుందని చెప్పింది. వివాహిత మహిళల ప్రయోజనాలను పరిరక్షించే చట్టాలను పార్లమెంటు చేసిందని తెలిపింది. గృహ హింస నిరోధక చట్టం వంటివి అమలవుతున్నాయని చెప్పింది. భార్యాభర్తల మధ్య బాంధవ్యంలో ఉండే అనేక అంశాల్లో శృంగారం ఒకటి అని కేంద్రం తెలిపింది. భారత దేశ సాంఘిక, న్యాయ పద్ధతుల దృష్ట్యా వివాహ వ్యవస్థ స్వభావాన్ని పరిశీలించినపుడు, ఈ వ్యవస్థను పరిరక్షించడం ముఖ్యమని చట్టసభలు అభిప్రాయపడితే, ఆ మినహాయింపును రద్దు చేయడం కోర్టుకు సరైనది కాదని స్పష్టం చేసింది.