Tuesday, October 1, 2024
Homeజాతీయంస‌ర్పంచ్ ప‌ద‌వికి ఏకంగా రూ. 2కోట్లు

స‌ర్పంచ్ ప‌ద‌వికి ఏకంగా రూ. 2కోట్లు

Date:

పంజాబ్ రాష్ట్రంలో మ‌రికొన్ని రోజుల్లో గ్రామ పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే కొన్ని గ్రామాల్లో స‌ర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ప్రకటనలు వచ్చాయి. ఈ పోలింగ్‌ ప్రక్రియతో సంబంధం లేకుండా ఓ గ్రామంలో సర్పంచిని వేలం పాటలో ఎన్నుకుంటుండటం గమనార్హం. ఇందులో ఈ పదవి ఏకంగా రూ.2 కోట్లు పలకడం తీవ్ర చర్చనీయాంశమైంది. గురుదాస్‌పుర్‌లోని హర్దోవల్‌ కలన్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరి సర్పంచి పదవి కోసం వేలం పాట నిర్వహించారు. రూ.50లక్షలతో వేలం మొదలవగా.. స్థానిక భాజపా నేత ఆత్మాసింగ్‌ ఏకంగా రూ.2 కోట్లు పాడారు. గ్రామానికి ఎవరు ఎక్కువ నిధులు ఇస్తారో వారినే సర్పంచిగా ఎన్నుకుంటారని సదరు నేత చెబుతున్నారు.

సోమవారంతో వేలం పాటకు గడువు ముగిసింది. ఇప్పటివరకు ఆత్మాసింగ్‌ మాత్రమే అత్యధిక బిడ్డింగ్‌ వేయడంతో ఆయననే సర్పంచిగా ఏకగ్రీవం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ‘వేలం పాట’ ఎన్నికపై రాజకీయంగా తీవ్ర దుమారం మొదలైంది. ‘ఇది బహిరంగ అవినీతి. ఇలాంటి ఎన్నిక అధికారికం కాదు. దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులను జైలుకు పంపాలి’ అని కాంగ్రెస్‌ నేత ఒకరు డిమాండ్‌ చేశారు. ఇది వివాదాస్పదం కావడంతో దీనిపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. మరోవైపు, సర్పంచి ఎన్నికకు ఆత్మాసింగ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి పదవికి ఇలా వేలంపాట నిర్వహించడం ఇదే తొలిసారి కాదట. ఇటీవల బఠిండాలోని గెహ్రి బత్తార్‌ గ్రామంలోనూ ఇలాగే వేలం ప్రక్రియ నిర్వహించగా.. అత్యధికంగా రూ.60 లక్షలు పలికినట్లు వార్తలు వచ్చాయి. అయితే, విజేతపై అక్కడ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పంజాబ్‌వ్యాప్తంగా 13,237 సర్పంచి స్థానాలకు అక్టోబరు 15న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను సమర్పించేందుకు అక్టోబరు 4వ తేదీ తుది గడువు. పోలింగ్‌ ముగిసిన తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.