Wednesday, October 16, 2024
Homeజాతీయంఅర్థరాత్రి రైలు కిటికీలో నుంచి జారిపడ్డ 8ఏళ్ల చిన్నారి.. చిమ్మచీకట్లో 16గంటల గాలింపు..

అర్థరాత్రి రైలు కిటికీలో నుంచి జారిపడ్డ 8ఏళ్ల చిన్నారి.. చిమ్మచీకట్లో 16గంటల గాలింపు..

Date:

మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథుర వెళ్లేందుకు ఓ కుటుంబం తమ 8 ఏళ్ల చిన్నారితో కలిసి రైలెక్కింది. వీరు బోగీలోని ఎమర్జెన్సీ కిటికీ వద్ద ఉన్న సీట్లలో కూర్చుకున్నారు. వెంటిలేషన్‌ కోసం కొందరు ప్రయాణికులు ఈ విండోను తెరిచారు. మార్గమధ్యంలో ఆ బాలిక ఉన్నట్టుండి కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. గమనించిన చిన్నారి తండ్రి వెంటనే లలిత్‌పుర్‌ రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు.

అప్రమత్తమైన ఝాన్సీ జీఆర్పీ పోలీసులు.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌తో కలిసి గాలింపు చేపట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయి రాత్రివేళ చిమ్మచీకట్లోనే 16 కిలోమీటర్ల మేర కాలినడకన గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టాల పక్కన ఉన్న ఓ చెట్ల పొదల్లో గాయాలతో స్పహకోల్పోయిన స్థితిలో బాలికను గుర్తించారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అటుగా వెళ్తున్న గూడ్స్‌ రైలును ఆపి వెంటనే లలిత్‌పుర్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. తన కుమార్తెను కాపాడిన రైల్వే పోలీసులకు ఆ పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను యూపీ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీమ్‌వర్క్‌తో చిన్నారి ప్రాణాలను కాపాడిన రైల్వే పోలీసులు, అధికారులను నెటిజన్లు కొనియాడుతున్నారు. రియల్‌ హీరోలంటూ అభినందిస్తున్నారు.