Thursday, October 31, 2024
Homeజాతీయంబాంబు బెదిరింపుల‌తో విమాన‌యాన సంస్థ‌ల‌కు 600 కోట్ల మేర నష్టం..!

బాంబు బెదిరింపుల‌తో విమాన‌యాన సంస్థ‌ల‌కు 600 కోట్ల మేర నష్టం..!

Date:

దేశంలో విమాన‌యాన సంస్థ‌ల‌కు బాంబు బెదిరింపులు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి. విమానంలో బాంబు పెట్టామ‌నే ఆక‌తాయిల హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఏ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినా కచ్చితంగా బాంబు థ్రెట్‌ అసెస్‌మెంట్‌ కమిటీ(బీటీఏసీ) ప్రొటోకాల్‌, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీల ప్రక్రియను చేపట్టాల్సిందే. దీంతో అనేక విమానాలు ఆలస్యమవుతున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న విమానాలను ఉన్నపళంగా వేర్వేరు విమానాశ్రయాలకు దారి మళ్లించాల్సి వస్తున్నది. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో వచ్చిన బాంబు బెదిరింపులకు విమానయాన సంస్థలు దాదాపుగా 600 కోట్లు నష్టపోయి ఉంటాయని గతంలో ఓ విమానయాన సంస్థలో పని చేసిన ఓ అధికారి తెలిపారు. సాధారణంగా ఒక డొమెస్టిక్‌ విమాన సర్వీసుకు అంతరాయం కలిగితే సగటున రూ.1.5 కోట్లు నష్టం వస్తుందని, అంతర్జాతీయ విమానానికి ఇది దాదాపు రూ.3.5 కోట్ల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

కఠిన నిబంధనల తీసుకొచ్చే అవకాశం

విమానాలకు వస్తున్న బెదిరింపులన్నీ నకిలీవే. ఇంతకుముందు అడపాదడపా ఇలాంటి బెదిరింపులు వచ్చేవి. ఇవి చాలావరకు ఆకతాయిలు చేసే పనులే అయి ఉండేవి. ఇప్పుడు మాత్రం ఒకేసారి పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తుండటంతో కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ హెచ్చరించాడు. దేశంలో విమానయాన రంగానికి ఆటంకం కలిగిస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్టులో చేర్చి ఎప్పడూ విమానాలు ఎక్కకుండా నిషేధించాలని విమానయాన శాఖ భావిస్తున్నది. దీంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వారిని వారెంట్‌ లేకుండా అరెస్టు చేసేలా సప్రెషన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ యాక్ట్స్‌ అగైనెస్ట్‌ సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌(స్వాస్కా చట్టం)-1982కు సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.