దేశంలో అన్ని క్రీడలకు, అన్ని క్రీడల క్రీడాకారులకు సమాన గుర్తింపు ఉండాలి. కాని మన దేశంలో క్రికెట్ అభిమానులే ఎక్కువగా ఉంటారు. వారికి గుర్తింపు ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర క్రీడల ఆటగాళ్లకు గుర్తింపు తక్కువే. ఈ నేపథ్యంలో హాకీ ఆటగాళ్లకు ఎదురైన ఓ నిరాశాజనకమైన సంఘటనను భారత హాకీ మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ పంచుకున్నాడు. ఎయిర్‌పోర్టులో హాకీ ఆటగాళ్లను పట్టించుకోకుండా సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్‌వాలాతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపినట్లు తెలిపాడు.
‘నేను స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో నా కళ్లతో చూశాను. అక్కడ నాతో పాటు హర్మన్ ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్‌వాలా అక్కడికి చేరుకున్నాడు. దీంతో అభిమానులంతా అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. మేము ఒకరిని ఒకరం చూసుకున్నాం. అది మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. హర్మన్ ప్రీత్ 150కి పైగా గోల్స్ చేశాడు. మన్‌దీప్‌కి 100కి పైగా ఫీల్డ్ గోల్స్ ఉన్నాయి. డాలీ చాయ్‌వాలా ప్రత్యేకమైన టీని తయారు చేసినందుకు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. బిల్‌గేట్స్‌కీ టీ అందించాడు. అది గొప్ప విషయమే, కానీ ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకాలు గెలుచుకున్నప్పటికీ భారత హాకీ స్టార్లు తగిన గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు. ఒక అథ్లెట్‌కు కీర్తి, డబ్బు ముఖ్యమే. కానీ అభిమానులు మమ్మల్ని చూస్తున్నప్పుడు, అభినందిస్తున్నప్పుడూ అంతకంటే ఆనందం మరొకటి ఉండదు’ అని హార్దిక్ చెప్పాడు.