Thursday, October 31, 2024
Homeజాతీయంట్రాఫిక్ బాధ భ‌రించ‌లేక వాహ‌నాలు రోడ్డుపై వ‌దిలి ఇంటికి న‌డుచుకుంటూ వెళ్లిన జనం..

ట్రాఫిక్ బాధ భ‌రించ‌లేక వాహ‌నాలు రోడ్డుపై వ‌దిలి ఇంటికి న‌డుచుకుంటూ వెళ్లిన జనం..

Date:

న‌గ‌రాలు రోజురోజుకు అభివృద్ది చెందుతున్నాయి.. కాని అభివృద్ది మాటేమో కాని ట్రాఫిక్ మాత్రం బీభ‌త్సంగా పెరిగిపోతుంది. అలాంటిది మన దేశంలో ట్రాఫిక్‌ జామ్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరమే. స్వల్ప దూరానికే గంటలు గంటలు వేచి చూడటం నగర పౌరులకు నిత్యం అనుభవమే. వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరు న‌గ‌రానిది దేశంలోనే అగ్రస్థానం. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. ఇక వరుస సెలవులు, భారీ వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. నగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కిలోమీటరు దూరానికి గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్‌ కష్టాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటారు.

తాజాగా నగరంలో మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. బుధవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై భారీగా జామ్‌ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో విసుగుచెందిన కొందరు తమ కాళ్లకు పని చెప్పారు. వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.