Monday, January 13, 2025
Homeజాతీయం70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం

70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం

Date:

2022వ సంవత్సరానికి గానూ 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు అందజేశారు.

ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి (కాంతార), ఉత్తమ నటిగా నిత్యా మేనన్‌ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌) అవార్డు అందుకున్నారు. ‘కార్తికేయ 2’ దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ఆట్టమ్‌’ (మలయాళం), తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు, మిథున్‌ చక్రవర్తి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ పురస్కారం స్వీకరించారు.

”దాదాపు 15 ఏళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇది. చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన తరుణమిది. నా సహ నటులు, ‘తిరుచిత్రంబలం’ బృందానికి ఈ అవార్డు అంకితమిస్తున్నా. మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నా” అని నిత్యా మేనన్‌ పేర్కొన్నారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌- 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్యం) విభాగంలో అవార్డు అందుకున్నారు ఎ.ఆర్‌.రెహమాన్‌. ఆయన మాట్లాడుతూ.. ”ప్రాంతం, భాష.. ఇలా సినిమాకి ఎలాంటి పరిధుల్లేవు. ఇది నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు. దీనికి కారకులైన ఫిల్మ్‌మేకర్స్‌ ముఖ్యంగా దర్శకుడు మణిరత్నానికి కృతజ్ఞతలు” అని అన్నారు.