Thursday, September 19, 2024
Homeజాతీయం25మంది ప్రాణాలు తీసిన చిరుత‌లు

25మంది ప్రాణాలు తీసిన చిరుత‌లు

Date:

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ బిజ్నోర్ జిల్లాలో జనావాసాల సమీపంలో చిరుతల సంచారం, దాడుల కారణంగా వారంతా ఏడాదిన్నరగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 85 గ్రామాల్లో 60వేల మంది ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి. బిజ్నోర్ సమీపంలో 500వరకు చిరుతలు ఉన్నాయని యూపీ అటవీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బిజ్నోర్‌కు చెందిన పిలానా ప్రాంతం ఎప్పుడూ జనాలతో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు వారంతా సాయంత్రం ఐదుకాగానే ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ”మా ఊరికి 15 కి.మీ.దూరంలో దట్టమైన అడవిలో చిరుతలు ఉంటాయి. అదేం మాకు కొత్త విషయం కాదు. కానీ 2023లో మా ప్రాంతంలో జరిగిన చిరుతదాడితో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ దాడులు సర్వసాధారణమవడంతో మా జీవనశైలి తారుమారయింది” అని స్థానికుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఆ ఒక్క గ్రామం పరిస్థితి మాత్రమే కాదని గుర్తించిన అధికారులు బిజ్నోర్‌లోని సుమారు 85 గ్రామాలను హైపర్ సెన్సిటివ్ కేటగిరీలోకి చేర్చారు. అవన్నీ అటవీ ప్రాంతానికి 8 కి.మీ. నుంచి 15 కి.మీల దూరంలోనే ఉన్నాయి. మ్యాన్‌ ఈటర్ చిరుతలను బంధించేందుకు కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నప్పటికీ.. స్థానికులకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ఊరట లభించలేదు. వాటిని బంధించేందుకు 107 పంజరాలను ఏర్పాటు చేశారు. పొలాలకు వెళ్లేప్పుడు ఒక్కరే వెళ్లొద్దని, ఫోన్లు, రేడియోల్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. చీకట్లో బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నప్పటికీ.. ఆగస్టు 29న మరో వ్యక్తి మ్యాన్‌ ఈటర్ చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఏడాదిన్నర కాలంలో మృతుల సంఖ్య 25కు చేరడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.