Thursday, October 31, 2024
Homeజాతీయం20కి పైగా విమానాల‌కు బాంబు బెదిరింపులు

20కి పైగా విమానాల‌కు బాంబు బెదిరింపులు

Date:

దేశంలో విమాన‌యాన సంస్థ‌ల‌కు బాంబు బెదిరింపులు రావ‌డం మామూలైపోయింది. తాజాగా శ‌నివారం తెల్ల‌వారుజామున 20కి పైగా విమానాల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇండిగోకు చెందిన ఐదు, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐదు, విస్తారాకు చెందిన మూడు విమానాలతో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌జెట్, స్టార్‌ ఎయిర్‌, అలయన్స్‌ ఎయిర్‌ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దిల్లీ నుంచి లండన్‌ బయల్దేరిన విస్తారా విమానానికి బెదిరింపులు రావడంతో దాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారిమళ్లించారు. ఇక, పారిస్‌-హాంకాంగ్‌, దిల్లీ-పారిస్‌ విస్తారా విమానాలకు కూడా ఈ తరహా బెదిరింపులు రాగా.. వాటిని అత్యవసరంగా దించేశారు.

ముంబయి-ఇస్తాంబుల్‌, దిల్లీ-ఇస్తాంబుల్‌, జోధ్‌పుర్‌-దిల్లీ, హైదరాబాద్‌-చండీగఢ్‌, జెడ్డా-ముంబయి ఇండిగో విమానాలకు ఈ ఉదయం బెదిరింపులు వచ్చాయి. వీటిల్లో కొన్నింటిని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. మరికొన్నింటి టేకాఫ్‌ను ఆపేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ పరిణామాలపై ఇండిగో స్పందించింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యధిక ప్రాధాన్యం అని, దీనిపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.