Saturday, December 21, 2024
Homeజాతీయం11రోజుల్లో ఏడుగురు మృత్యువాత‌

11రోజుల్లో ఏడుగురు మృత్యువాత‌

Date:

ఓ చిరుత రాజ‌స్థాన్ ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఉదయ్‌పుర్‌ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆలయ పూజారిని బలిగొంది. చిరుత అతడిపై దాడి చేసి, అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లిందని స్థానికులు చెప్పారు. సోమవారం ఉదయం అటవీ ప్రాంతంలో పూజారి మృతదేహాన్ని గుర్తించారు. ఇలా గత 11 రోజుల్లో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. గోగుండా ప్రాంతంలో విష్ణుగిరి అనే 65 ఏళ్ల పూజారి ఆలయ సమీపంలో నిద్రిస్తుండగా.. చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. సమీప అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అతడి మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రాంతంలో చిరుత దాడులు ఎక్కువవుతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వాటి దాడుల్లో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు. ఈ దాడులన్నింటినీ ఒకే చిరుత చేస్తున్నట్లు ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు వివరించారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు.