జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కుఫ్రి, స్పితి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మొదటిసారి మంచు పడింది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.
మరోవైపు మంచు కారణంగా ఉష్ణోగ్రలు క్షీణించాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. టాబో నగరంలో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 13 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. కుకుమ్‌సేరిలో మైనస్ 6.9 డిగ్రీల సెల్సియస్, కల్పలో మైనస్ 3.3 డిగ్రీల సెల్సియస్, రెకాంగ్ పియోలో మైనస్ 1 డిగ్రీల సెల్సియస్, నార్కండలో మైనస్ 0.8 డిగ్రీల సెల్సియస్‌తో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సిమ్లాలో ఉష్ణోగ్రతలు దాదాపు 2.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇతర పట్టణాల్లో దాదాపు గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సియోబాగ్‌లో 0 డిగ్రీల సెల్సియస్, బజౌరాలో 0.1 డిగ్రీల సెల్సియస్, మనాలిలో 0.2 డిగ్రీల సెల్సియస్, కుఫ్రీలో 0.4 డిగ్రీల సెల్సియస్, సోలన్‌లో 0.5 డిగ్రీల సెల్సియస్, ఉనాలో 1 డిగ్రీ సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా మంచు పడుతుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఎత్తైన ప్రదేశాల్లోని గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.