Saturday, December 21, 2024
Homeజాతీయంస‌చివాల‌యం మూడో అంత‌స్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీక‌ర్‌

స‌చివాల‌యం మూడో అంత‌స్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీక‌ర్‌

Date:

మ‌హారాష్ట్ర‌లో ఆదివాసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సొంత వర్గం ఎమ్మెల్యేలే ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్‌ సహా కొందరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అక్కడ సేఫ్టీ నెట్‌ ఉండటంతో వీరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ పరిణామాలతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధన్‌గఢ్‌ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చాలన్న డిమాండ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ నరహరి ఝిర్వాల్‌తో పాటు భాజపా ఎంపీ హేమంత్ సావ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమాటే, హిరామన్ ఖోస్కర్, రాజేష్ పాటిల్ నిరసన చేపట్టారు. సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు. మొదటి అంతస్తు వద్ద ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లో పడ్డారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. వీరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అనంతరం వారంతా సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు.