ఇటీవల బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి షారుక్‌ను బెదిరింపు కాల్ చేశారు. ఈ బెదిరింపుల ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది మహ్మద్ ఫైజాన్ ఖాన్‌గా గుర్తించారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల నివాసంలో అతడిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తాజాగా తెలిపారు.
ఐదు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి నేరుగా ముంబై పోలీసులకే బెదిరింపు కాల్ వచ్చింది. బాంద్రా పోలీసు స్టేషన్లో దీనిపై కేసు నమోదు అయ్యింది. భారత న్యాయ సంహితలోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా అరెస్ట్ చేశారు. ఇటీవల మరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఫోన్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆ బెదిరింపులకు పాల్పడింది. కృష్ణ జింకను చంపిన కేసులో.. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను వెంటాడుతున్నది. ఆ గ్యాంగ్ అతని వద్ద 5 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసిందే.