బాల్య వివాహం జరిపిన కేసుల్లో వ్యక్తులను శిక్షించినా.. పెద్దగా ఏమీ మార్పు జరగడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బాల్య వివాహాల నిర్మూలన చట్టాల అమలు తీరుపై భారత ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది. ఆ చట్టాల ద్వారా బాధితులను శిక్షించినా.. ప్రయోజనం జరగడం లేదని, అయితే కమ్యూనిటీ ఆధారంగా ఆ చట్టాలను అమలు చేయాలని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విన్నది. బాల్య వివాహాల చట్టాల అమలు తీరును ప్రశ్నిస్తూ ఓ ఎన్జీవో వేసిన పిల్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.
చట్టాలను అమలు చేయడం అంటే శిక్షించడమే కాదు అని కోర్టు పేర్కొన్నది. పీసీఎంఏ చట్టం అమలు విషయంలో వివిధ వర్గాల ప్రజల మద్య సహకారం అవసరం అని కోర్టు తెలిపింది. చట్టాల అమలుతో లక్ష్యాలు సాధించేందుకు కొన్ని మార్గదర్శకాలను కోర్టు సూచించింది. తాము సూచించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.