కేరళలోని శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. అయితే ఆ విమానాశ్రయం కోసం సుమారు 3.4 లక్షల చెట్లను తొలగించాల్సి ఉంటుందని కొట్టాయం జిల్లాశాఖ ఓ నివేదికను తయారు చేసింది. దీని కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నివేదికను రూపొందించారు. ఒకవేళ ఎయిర్‌పోర్టు నిర్మిస్తే సుమారు 353 కుటుంబాలను తరలించాల్సి వస్తుందని రిపోర్టులో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం 3.3 లక్షల రబ్బరు, 2492 టేకు, 2247 వైల్డ్ జాక్, 1131 జాక్‌ఫ్రూట్, 828 మహోగని, 184 మామిడి చెట్లను తొలగించాల్సి ఉంటుంది. చెట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఏడు మతపరమైన ప్రదేశాలను మార్చాల్సి వస్తోందని రిపోర్టులో తెలిపారు. శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు ద్వారా 347 కుటుంబాలు నేరుగా నష్టపోనున్నారు. దీంట్లో 238 కుటుంబాలు చెరువెల్లి ఎస్టేట్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడే చెరువెల్లి జాతి ఆవు కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఎస్టేట్‌ను మార్చేస్తే, అప్పుడు ఆవుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని రిపోర్టులో వెల్లడించారు.
శబరిమల విమానాశ్రయం కోసం 1039.876 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. ఆ భూమిని మణిమాల, ఎరుమేలి సౌత్ గ్రామాల నుంచి సేకరించనున్నారు. శబరిమల యాత్రికులు, ఎన్ఆర్ఐలు, పర్యాటకులు, ఇతర ప్రయాణికుల ఉద్దేశంతో కేఎస్ఐడీసీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు.