దేశంలో విమానయాన భద్రతకు మొదటి ప్రాధాన్యత అని, బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులు మొత్తం బూటకమని తేలిందన్నారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్ ఉందని.. దానినే తమ శాఖ, విమానయాన సంస్థలు అనుసరిస్తోందని వివరించారు. ఇలాంటి బెదిరింపులు వచ్చిన సమయంలో పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ విధివిధానాలను మనం అనుసరించాలని ఆయన వ్యాఖ్యానించారు.
బెదిరింపు కాల్స్, సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. విమానంలో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడేవారికి ఇటువంటి శిక్ష విధించేలా ఇప్పటికే చట్టంలో సెక్షన్లు ఉన్నాయి. కానీ, ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా వీటిని వర్తింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో ఉగ్రకోణంపై స్పందించేందుకు కేంద్ర మంత్రి నిరాకరించారు. అక్టోబర్ 14 నుంచి పలు విమానాలకు దాదాపు 100 బెదిరింపులు వచ్చాయి. ఈ అంశంపై పలు వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానయాన భద్రతా నిబంధనల సవరణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.