దేశంలో ఇటీవల భారత విమానయాన సంస్థలకు గత నాలుగు రోజులుగా వరుస బాంబు బెదిరింపులు రావడంతో పలు విమాన సర్వీసులు రూట్ మార్చడంతోపాటు అత్యవసరంగా ల్యాండింగ్ అవుతున్నాయి. ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకొనే దిశగా పౌర విమానయానశాఖ సన్నద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
గత నాలుగు రోజుల్లో 20పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. వీటిపై చేపట్టిన విచారణలో అవన్నీ నకిలీవని తేలాయి. దీంతో ఇలాంటి పనులు చేసే ఆకతాయిలను అడ్డుకొనేందుకు పౌర విమానయానశాఖ నడుంబిగించింది. వారిని నో- ఫ్లై లిస్ట్‌లో యాడ్ చేయాలని చూస్తోంది. అంతే కాదు అలాంటి వారికి కఠిన శిక్షలు వేసేలా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’లో మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నిబంధనల్లో మార్పులు చేసేందుకు అభిప్రాయాలను సేకరిస్తోంది. విమానంలో వికృత చేష్టలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా పలు నిబంధనలు ఉన్నాయి. అయితే సోషల్‌మీడియా నుంచి వచ్చే బాంబు బెదిరింపులు లాంటి సందర్భాలు ఎదురైతే శిక్షించేందుకు ఎలాంటి నిబంధనలు లేవు. తరచూ ఈ తరహా ఘటనలు ఎదురవుతున్న నేపథ్యంలో వీటి కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చేందుకు కేంద్రం చూస్తోంది.