దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఏడాది కాలంలో 1.68లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో 60శాతం మంది యువకులేనన్నారు. కేంద్రమంత్రి లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం, టోల్ సెంటర్ల సంఖ్య వరకు పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్ లోక్‌సభలో ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే లోపాలను ఎత్తి చెప్పారు. ఇప్పటి వరకు 150 మంది మృతి చెందారని.. దౌసాలోనే 50 మందిపైగా మరణించారని నాగౌర్ ఎంపీ తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేపై నియమించిన కాంట్రాక్టర్‌లు, అధికారులపై చర్యలు, విచారణ నివేదికకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన బదులిచ్చారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అని, ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో నిర్మించినట్లు తెలిపారు.
రూ.లక్ష కోట్ల ఖరీదుతో వేశామన్నారు. పలుచోట్ల రోడ్డు దెబ్బతిందని.. మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో నలుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులపై చర్యలు తప్పవన్నారు. నిర్ణీత సమయంలో పనులు చేయాలని కోరుకుంటున్నామని.. కాంట్రార్ట్‌లు గడువులోగా పనులు చేయాల్సిందేనన్నారు. ఎవరితో ఏ విషయంలోనూ రాజీపడబోమన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దేశంలో ఏడాది కాలంలోనే 1.68లక్షల మంది మరణించారన్నారు. ఇందులో 60శాతం యువకులే ఉన్నారని.. ఇది విచారకరమన్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు సమాజం సహకరించాలన్నారు. ఏ అల్లర్లలోనూ ఇంత మంది చనిపోలేదని.. రోడ్డు ప్రమాదాల్లోనేనన్నారు. చనిపోయిన వారిలో 60శాతం మంది బాలబాలికలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర శాసన మండలిలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గాయపడితే నాలుగుచోట్ల ఎముకలు విరిగాయని.. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నానన్నారు. రోడ్డు భద్రత విషయంలో ఎంపీలు సైతం సహకరించాలని కోరారు.