భారతీయ రైలు టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండగా దానిని 60 రోజులకు కుదించింది. ఇందుకోసం ఐఆర్సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. 2024 నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ.. అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధన వర్తిస్తుంది. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌లో ఎటువంటి మార్పూ లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉంది. ఇక విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇందులోనూ ఎలాంటి మార్పూ లేదు. ఇదిలా ఉంటే, గతంలోనూ రైల్వే ముందస్తు బుకింగ్ ప్రయాణానికి 60 రోజుల ముందే ఉండేది. దానిని 120 రోజులకు పెంచిన భారతీయ రైల్వే.. తాజాగా మళ్లీ మునుపటి వ్యవధికే మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం నేపథ్యంలో ఐఆర్సీటీసీ షేరు విలువ 2 శాతం మేర క్షీణించి రూ.873 వద్ద ట్రేడవుతోంది. గడువు కుదింపు వల్ల ఆ మేర క్యాన్సిలేషన్లు తగ్గి ఐఆర్సీటీసీకి ఆదాయం తగ్గే అవకాశం ఉండడమే దీనికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు.