ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ రైల్వేస్టేషన్లో నిర్మాణంలో ఉన్న ప్రవేశద్వారం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు మొదలుపెట్టాయి. శిథిలాల కింది చిక్కుకున్న 11 మందిని వెలికితీశాయి. వారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మిగతా కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్తోపాటు స్థానిక అధికారులు, పోలీసులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం యోగి చెప్పారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణమే అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ను సమకూర్చాలని సూచించారు. బాధితులంతా త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.