వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందమైన అమ్మాయిలు మాత్రం వ్యవసాయం చేసే యువకులు అంటేనే పెళ్లికి నిరాకరిస్తున్నారని మహారాష్ట్ర ఎమ్మెల్యే దేవేంద్ర భూయర్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, వరుద్ తహశీల్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓ అమ్మాయి అందంగా ఉంటే, ఆమె పెండ్లి చేసుకోవడానికి నీలాంటి, నాలాంటివాళ్లని ఇష్టపడటం లేదు. ఆమె ఉద్యోగస్థుడినే ఎంచుకుంటున్నది.
నంబర్ 2లో, ఓ మోస్తరు అందంగా ఉండే అమ్మాయిలు కిరాణా దుకాణం, పాన్ కొట్టు నడిపే యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందంలో తక్కువ స్థాయిలో ఉన్న అమ్మాయిలు రైతుల కుమారులను చేసుకుంటున్నారు’ అని అన్నారు. అలాంటివారికి అందగాళ్లు పుట్టడం లేదన్నారు. దేవేంద్ర భూయర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు మద్దతిస్తున్నారు. దేవేంద్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత యశోమతి ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.