Sunday, December 22, 2024
Homeజాతీయంరైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం..

రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం..

Date:

రైతుల డిమాండ్ల పరిష్కారానికై చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవ‌డంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. రైతులపై హర్యాణా పోలీసులు టియర్‌ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటనలో సుమారు 17 మంది రైతులకు గాయాలయ్యాయి. దీంతో రైతు సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి తమ పాదయాత్రను నిలిపివేశారు. అంతర్గత సమావేశం అనంతరం తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నాయకుడు తేజ్వీర్‌ సింగ్‌ తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారానికై రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. శ‌నివారం మధ్యాహ్నం ‘చలో ఢిల్లీ’ మార్చ్‌ను ప్రారంభించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే, రైతులను శంభు సరిహద్దు వద్ద హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక రైతుల ఢిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకోవడం ఇది మూడోసారి. డిసెంబర్‌ 6 నుంచి ఢిల్లీ వైపుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. ఇప్పటికే ఆ ప్రయత్నాలను రెండుసార్లు పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసుల తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల ఢిల్లీ మార్చ్‌ నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకూ సేవలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.