హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి విపత్తుతో అల్లకల్లమయింది. ఆ రాష్ట్రానికి అండగా నిలిచేందుకు సీఎం, మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల పాటు జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అందులో చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు భాగంకానున్నారు. ఈ ప్రకటన చేసింది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అల్లకల్లోలమైంది. ఆగస్టు నెలలో కులు, మండి, శిమ్లా జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. జూన్ 27 నుంచి ఆగస్టు 9 మధ్యలో 100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్‌లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. దాంతో రోజువారీ కార్యకలాపాలతో పాటు పర్యటకంపై ప్రభావం పడింది.